పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/567

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0195-4 శ్రీరాగం సంపుటం; 07-565

పల్లవి:
తమకించకురె మీరు తరుణులాల
సముకపు నవ్వె మేలు జాణనితోను

చ.1:
విన్నవించినా మేలు వెరగుతోనున్నా మేలు
అన్నియు నెరిఁగినట్టి యాతనితోను
కన్నుల మొక్కినా మేలు కాఁకలు చల్లినా మేలు
సన్నెరిఁగి మేలఁగేటి సరసునితోను

చ.2:
ప్రియము చెప్పినా మేలు బిగువుతోనున్నా మేలు
నయగారి గుణముల నాథునితోను
క్రియలు చూపినా మేలు కేలెత్తి మెచ్చినా మేలు
దయదలఁచనేర్చిన తగుదొరతోను

చ.3:
సేవలు చేసినా మేలు చెక్కులు నొక్కినా మేలు
యీవల నన్నుఁ గూడిన యీతని తోను
వావులు చెప్పినా మేలు వన్నెలు చూపినా మేలు
శ్రీ వెంకటేశుఁడైనా చెలువునితోను