పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/566

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0195-4 సామంతం సంపుటం: 07-564

పల్లవి:
ఆపెతోనేమి మాటాడీనంతవాఁడు
యీపనికి నావంక నిటుచూడుమనవే

చ.1:
తగవు చెప్పఁగఁబోతే తన మీఁద మోఁచు మాట
మగువలకెంతైనా మంచితనాలే
యెగసక్యాలిఁక వద్దు యేల రట్టుసేసుకొని
యిగిరించె వలపులు యీడకు రమ్మనవే

చ.2:
పంతములాడఁగఁబోతే పాడి దానే యియ్యవలె
కాంతల నెవ్వరైనాను కాదనరు
వింతలేల సేసుకొని వేగిరమే తనకును
యెంతైనాఁ బోదు వావి యీడకు రమ్మనవే

చ.3:
వెనక సుద్దులెంచితే వేవేలుఁ దనవల్లనే
వనితల కెప్పుడును వాసి వన్నెలే
యెనసెను శ్రీ వెంకటేశుఁడు ముందె నన్ను
యినుమడించెఁ దమక మీడకు రమ్మనవే