పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/565

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0195-3 సౌరాష్ట్రం సంపుటం: 07-563

పల్లవి:
నేఁడు గొత్తగాదు తొల్లే నీకు నాకుఁ గలదే
ఆఁడుదాన బలిమేదీ ఆయము నీ చేతిది

చ.1:
వొట్టిన నీ చేఁతలకు వొడిగట్టుకొన్నదాన
గట్టిచనుఁగవవారకపుదానను
ఎట్టుసేసినా నీచిత్తమెదురాడేవారెవ్వరు
పట్టిన నావలపుభారము నీమీఁదిది

చ.2:
పొంచుకొని పాదముల పొందులు మెట్టినదాన
పంచల సిగ్గుల తలఁబాలదానను
కంచము పొత్తుకు లోనుకలది నీచేతిదింతే
మంచముపైఁ బెనఁగే నామర్మము నీచేతిది

చ.3:
వేడుక మోవి తీపుల విందుకు లోనైనదాన
వీడెమందుకొన్న యరవిరిదానను
జాడతోడ శ్రీ వెంకటేశ చనవిచ్చితివి నాకు
కూడితివి నాలోని గుణము నీచేతిది