పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/563

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0195-11 శ్రీరాగం సంపుటం: 07-561

పల్లవి:
తాను చేసినచేఁత తారుణిమేనను నిండె
వీనులు చల్లఁగ నిట్టె విన్నవించరే

చ.1:
జక్కవ గుబ్బలమీఁద చంద్రోదయములాయ
చుక్కలు మొలచెనిదె సొంపుమోవిని
అక్కజపుతురుమున నద్దమరేతిరి నిండె
వెక్కసపుపతికిది వేళ చెప్పరే

చ.2:
కనుచూపు తామెరల గక్కుననుఁ దెల్లవారె
యెనయని తలపోఁతనెండలు గానె
పనివడి విరహన పట్టపగలై తోఁచె
ననిచిన పతికి సన్నలు సేయరే

చ.3:
వడిగొన్న జవ్వనాన వసంతకాలము వచ్చె
పొడవైన కళలను పున్నమ గూడె
యెడమిచ్చి శ్రీ వెంకటేశుఁడింతలోఁ గూడె
జడివాయకుండఁ దన్ను బాసగొనరే