పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/561

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0193-5 రామక్రియ సంపుటం:07-559

పల్లవి:
నీదేవులే నిన్ను నేరములెంచీఁ గాక
పాదు సేసుకొని నిన్ను పచ్చిసేయఁ దగునా

చ.1:
మఱచినా నీమాట మాడసేసుఁ గోటిసేసు
యెఱిఁగి తలఁచుకొంటే యెంతైనాఁ జేసు
యెఱఁగనెట్టువచ్చు యింతేసి దొరలను
తఱి వేచి చెలులము తప్పులెంచఁ దగునా

చ.2:
రాతిరింటి నీపనులు రతికెక్కు రచ్చకెక్కు
యీతల వేగి లేచితే నింటికెక్కును
చేతనటు చూపువచ్చు చెల్లుబడిగలవారి
ఘాతసేసి చెలులము కక్కసించఁ దగునా

చ.3:
మునుకొన్న నీగుట్టు మొదలౌను కొనయౌను
ననిచి చించివేసితే నడుమౌను
వనితఁ గూడితివిట్టె వైపుగా శ్రీవెంకటేశ
పనివడి చెలులము బాసగొనఁ దగునా