పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/558

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0194-2 ముఖారి సంపుటం: 07-556

పల్లవి:
బుద్ది నేము చెప్పేమా పూఁటపూటకు
గద్దరిఁడు తానె యెరఁగవలెఁ గాక

చ.1:
వెగటుగ నేమంతేసి విన్నవించవలెనా
తగవెరిఁనవాఁడు తాఁ గాక
మగువ లేమాడినాను మచ్చరించఁదగునా
నగవు సేసుక పై కొనఁగవలెఁ గాక

చ.2:
భ్రమయించి మాగుట్టు పచరించవలెనా
తమకపడేటివాఁడు తాఁగాఁడా
రమణులకు కూరిములు రచ్చఁబెట్టవలెనా
సమ రతులకుఁ జేయి చాఁచవలెఁ గాక

చ.3:
చెక్కునొక్కి నేమిఁకఁ జెనకఁగవలెనా
దక్కగొని నన్నుఁగూడి తానెరఁగఁడా
చిక్కి శ్రీ వెంకటేశుఁడు సెలవి నవ్వవలెనా
మిక్కిలి రతులఁజొక్కి మేలమాడుఁ గాక