పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/557

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0194-1 కేదారగౌళ సంపుటం: 07-555

పల్లవి:
నీవు వింతవాఁడవో నే వింతదాననో
చేవదేరి నా నవ్వు సిగ్గుదెచ్చీఁ గాక

చ.1:
నీతలఁపులోనిదాన నీకు నిచ్చకురాలను
కాతరించి నీవనఁగాఁ గాదనేనా
రేతిరిమాటలకును రిచ్చలాయ నామనసు
పైతరవై అందుకొడఁబడనీదు గాక

చ.2:
కైవశమయ్యిన నేను కందువ చేఁతల నేను
వోవరిలోని వంటఁగా నోపననేనా
నీవొళ్ళివేసాలకు నిండుఁగాఁక రేఁగి లోలో
భావముఁ జలము నేఁడు పంతమాడీఁ గాక

చ.3:
ఎనసితివి రతికి నియ్యకోలు చేసుకొంటి
తనిసి నీవల్ల మరి తప్పులెంచేనా
ఘనుఁడ శ్రీ వెంకటేశ కడమదొడమలకు
అనుఁగుఁగూరిములెల్లా ఆసపడీఁ గాక