పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/553

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0193-3 గౌళ సంపుటం: 07-551

పల్లవి:
మాపుదాఁకా నమర నీ మాయలేలా
వీఁపు గానరాఁగా దాఁగే విధములేలా

చ.1:
వాడుదేరీ మోమని వలసి నేనడిగితే
యేడలేని మాటలేల యెన్నికలేల
నీడకు నిన్నుఁదీసితే నిలువుఁ జెమటలకు
వీడెప్తుఁ జొక్కుమందులు వేమారునేలా

చ.2:
పచ్చిదేరే నీ మేను భావించి నేఁజూచితేను
యిచ్చకాలు సేయనేల యింతలో నీకు
వెచ్చనిమేనిపైఁ జెయివేసి నిన్ను నవ్వితేను
బచ్చెన మాటలేల పరాకులెలా

చ.3:
కన్నెలు నీవద్దివారు ఘనుఁడవు నీవంటే
కన్నుల తేలింపులేల కరఁగులేలా
యిన్నిటా శ్రీవేంకటేశ యెనసి నేమొక్కితేను
వన్నెల నింతేసి పరవశములేలా