పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/552

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0193-2 కాంభోది సంపుటం; 07-550

పల్లవి:
చెల్లు నీకు నిఁక నీ చేతఁ జిక్కె వలపు
యెల్లవారమును నిన్ను యిఁక దూరేమా

చ.1:
చేసిన చేఁతల కెల్ల శికర మెత్తిన యట్టు
యీసతి వంచిన శిరసెత్తెఁగా నీకు
వేసారని సిగ్గులగు వెరసి వెట్టినయట్టు
మూసిన మోవి పై నాపె ముద్రవెట్టెఁగా

చ.2:
సంగడి కోరికలకు సఫలమైనయట్టు
వుంగిటిఁ గుచాల నాపె వొత్తెఁగా నిన్ను
కంగులేని నీ గుణాలు కవిలెల వ్రాసీనట్టు
అంగమెల్ల గోర గీరి అంటెఁగా నిన్ను

చ.3:
కూడిన కూటములెల్ల కోటికొండలైనట్టు
నీడలుగాఁ బులకలు నించెఁగా ఆపె
యీడనె మావాఁడవైతివిప్పుడె శ్రీ వెంకటేశ
వోడఁగట్టిన దూలమై వొద్దనాపె వుండెఁగా