పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/545

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0192-1 వరాళి సంపుటం: 07-543

పల్లవి:
నన్నేమి వొగడీనే నాథుఁడు తాను
యెన్నికెలెంచి చూచితే యింతాఁ దానె కాఁడా

చ.1:
పాయము నామేనిమీఁదఁ బచరించుచున్నది గాని
ఆయమై వుండినవాఁడంతాఁ దానే
చాయల సన్నలచేత జడిసివుందానఁ గాని
చేయిమీఁదైనవాఁడు చేరి తానే కాఁడా

చ.2:
చెంతల నాసిగ్గులెల్లా చెలరేఁగున్నవి గాని
అంతరంగములో వాఁడంతాఁ దానే
కాంతుల నామొగమున కళలిట్టే నిండెఁ గాని
యింతనాచక్కఁదనాలకేలిక దాఁ గాఁడా

చ.3:
మంచితనమెల్లా నామాటలనున్నది గాని
అంచెలనందలి యర్థమంతాఁ దానే
కొంచక నన్నుఁ గలసే కోరికలు నావి గాని
మించి శ్రీ వెంకటేశుఁడుక మేలు దానే కాఁడా