పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/543

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0191-5 పాడి సంపుటం; 07-541

పల్లవి:
ఎందు వోయ నేనీకు యెప్పుడు గలదాననే
కందువ వింతవారి గక్కనఁ జూడరాదా

చ.1:
ప్రియములు చెప్పఁగాని బిగియఁగ నేనోప
నయములే కాని జంకెనలకునోప
దయఁజూడు నన్ను నీవు తగిలి యాల పట్టేవు
క్రియెరిఁగినదానిపైఁ గేలు చాఁచరాదా

చ.2:
మచ్చిక చల్లేఁగాని మంకుఁదనమునకోప
యిచ్చకమే కాని వట్టియెగ్గులకోప
వచ్చినట్టే రమ్మా నన్ను వద్దికేల పిలిచేవు
మెచ్చినట్టివారితోనే మేలమాడరాదా

చ.3:
యేకతానఁ గూడేఁగాని యెరవుసేయఁగనోప
పైకొని మొక్కేఁగాని పంతానకోప
యీకడఁ బొందితివి నన్నింతలో శ్రీవేంకటేశ
నాకొరకునందరితో నవ్వు నవ్వరాదా