పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/541

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0191-3 హిజ్జిజి సంపుటం; 07-539

పల్లవి:
ఎంతకెంత విచారములేమున్నవి
పాంతల నేము చేసిన పుణ్యమిదిగాక

చ.1:
మరిగినదాన నే మాటల దూరితిఁ గాక
దొరవు కోపములు నీతోఁ జెల్లునా
తెరమరుఁగింతె నీవు తెలియనిదేమున్నది
పారసి నేము సేసిన పుణ్యమిదిగాక

చ.2:
పాయపుదాననై పదరి అంటితిఁ గాక
చాయకాఁడవు నీతో సలిగెల నా
నాయములెంచి చూచితే నాకు నీకు భేదమేది
పోయినరాత్రి సేసిన పుణ్యమిది గాక

చ.3:
మనసులోదాననై మర్మములు రేఁచితిఁగాక
చెనకి నీమేను పచ్చిసేయఁదగునా
ఘనుఁడ శ్రీ వెంకటేశ కలసితిమిద్దరము
పొనుఁగక నేఁజేసిన పుణ్యమిదిగాక