పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0109-5 బౌళి సంపుటం: 07-053

పల్లవి:
చెప్పకున్న దోసము చెంగటఁ గన్నంతవట్టు
యిప్పుడె యాతని చిత్తమేమైనాఁ జేయని

చ.1:
మంతనపు విచారాలు మాటల పచారాలు
కాంతకు విభునిఁ బాసి కలిగె నేఁడు
యింతయును గంటిరిగా యింతులార మీరైనా
వింతగానిట్టే విన్నవించరే యాతనికి

చ.2:
మంచముపై ముసుగులు మనసులో విసుగులు
అంచగమనకిదివో అమరె నేఁడు
మించినవో చెలులాల మీరే తెలిసితిరిగా
ముంచి మీరాతనిపై మోపుగట్టి వేయరే

చ.3:
కన్నుల తెలినిగ్గులు కాఁకలలో సిగ్గులు (ను)
పన్నిన యీసతిపైనే పైకొనె నేఁడు
యిన్నిట శ్రీ వేంకటేశుఁడింతలో విచ్చేసి కూడె
కన్నెతపము ఫలించె ఘనునిట్టే మెచ్చరే