పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/538

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0190-6 దేసాక్షి సంపుటం: 07-536

పల్లవి:
మామాట విని నీవు మచ్చికలు దైవార
ఆముకొని పతిమేను అంటంగరాదా

చ.1:
మనసు నమ్మినయందు మతకాలెంచఁగనేల
చనవు గలిగినందు జరయనేలా
కినుకలు లేనియందు కేరడము మరియాల
పెనఁగక పతినిట్టే పిలువరాదా

చ.2:
చేతికి లోనైనయందు సిగ్గులువడఁగనేల
బీతి విడిచినయందు బీరములేల
యేతులు నెరపనందు యెగ్గులు దలఁచనేల
జాతి నీనవ్వులు మీఁదఁ జల్లరాదా

చ.3:
కప్పురవీడేలందు కాఁకలు చల్లఁగనేల
చిప్పిలు రతులయందు చింతించనేల
యిప్పుడే శ్రీవెంకటేశుఁడీతఁడిదె నిన్నుఁగూడె
దప్పిదీర మోవియిచ్చి తనివందరాదా