పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/535

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0190-3 మాళవి సంపుటం: 07-533

పల్లవి:
ఇంతసేతురటవే యీతని నేఁడు
వింతలు మామాటలివి వినవే వోచెలియా

చ.1:
పంతమాడుకొనరాదువ పతితోడ సతికిని
అంతరంగమెరిఁగిచ్చలాడుటగాని
దొంతులు వెట్టఁగరాదు తోడుతనే చలములు
కొంత వినయాన వంచుకొనవలెఁ గాని

చ.2:
వాసికిఁ బెనఁగరాదు వద్దనున్న నాయకుని
మోసలేక మెప్పించి మొక్కుటగాని
ఆసలు మానుపరాదు ఆయాలు సోఁకినవేళ
సేసవెట్టి తనివంద చెందవలెఁగాని

చ.3:
కాదుగూడదనరాదు కాఁగిట శ్రీ వెంకటేశు
నాదరించి సరసములాడుటగాని
పోదితోనాతఁడె నిన్ను భోగించె కడమలేదు
పాదుకొన్న తమకము పంచుకొంటగాని