పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/533

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0190-1 రామక్రియ సంపుటం: 07-531

పల్లవి:
ఒంటి నీకెదురుచూచి వుందాన నేనింటిలోన
వెంటవెంటఁ దిరిగాడి వేరించనేరను

చ.1:
సిగ్గున నుందానఁ జుమ్మీ చెలువుండ నీవు నాతో
నిగ్గుల మాటాడి ప్రేమ నించుదాఁకాను
యెగ్గులేక నీకు మీఁదెత్తితి జవ్వనమెల్లా
వెగ్గళపు విన్నపాలు వేరే సేయనేరను

చ.2:
నవ్వుతానుందానఁ జుమ్మీ నాలోనియాసతో నీవు
చివ్వన తలయెత్తి చూచినదాఁకాను
యివ్వల కానుకిచ్చితి విట్టే చక్కఁదనమెల్లా
రవ్వగాఁ గొరి నిన్ను రాఁపుసేయనేరను

చ.3:
ఆసలనుందానఁ జుమ్మీ అట్టె శ్రీ వెంకటేశ
నీసరి నేఁడు గూడి మన్నించుదాఁకాను
వానుల నీకందిచ్చితి వన్నెల నామనసెల్లా
సేసవెట్టితివి మరి చింతించనేరను