పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0109-4 సామంతం సంపుటం: 07-052

పల్లవి:
ఎగ్గు సిగ్గు దలఁచవు యేరా నీవు
వొగ్గుచు నిద్దరు సతులొద్దనె వుండఁగను

చ.1:
కొనవేలు వట్టి యాకెఁ గూచుండఁబెట్టుకోఁగా
తనువిందువంకఁ గొంత తనిసెనా
పెనఁగి పాదాలు నాచేఁ బిసికించుకొనేవిదె
వనిత నీవద్దనుండి వలపు చల్లఁగను

చ.2:
అప్పుడే వీఁపునం జన్నులానుకొంటా నాపెచేత
కొప్పు వెట్టించుకొనేవు కోరికాయనా
యిప్పుడే నాచెక్కు మోవనేకతములాడేవు
చిక్కించుక సతి నీపైఁ జేతులు చాఁచఁగను

చ.3:
సంగతిగా నాపె తోడ జాణతనాలాడేవు
అంగవించి నేఁడు నీకు నాసవుట్టెనా
ముంగిట శ్రీ వేంకటేశ ముంచి నన్నుఁ గూడితివి
కంగక మగువ నీకుఁ గాచుకవుండఁగను