పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/529

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0189-3 దేసాక్షి సంపుటం: 07-527

పల్లవి:
చెలులమెందాఁక నీకు చెప్పేము బుద్ది
నిలుచుకున్నది యింతి నీరాకకెదురు

చ.1:
పలికితివాకెతోడ పంచమవేదములు
తలఁచుకోవయ్య నీవు తగులాయాలు
పిలిచితిమిదే నిన్ను ప్రియమెల్లాఁ జెప్పితిమి
తెలుకోవయ్య యిట్టె తేనెమోవితీపులు

చ.2:
కురిసితివి నవ్వుల గురిగాఁబువ్వులవాన
కరఁగుకోవయ్య లోలో గట్టిమనసు
మరిగించితివి మరి మచ్చికలు సేసితివి
వొరసుకోవయ్య చన్నులొగిఁ బైఁడికుండలు

చ.3:
పెట్టితివి చూపులనే పెనకప్పురవీడేలు
మెట్టురయ్య పాదములు మీరు మీలోన
యిట్టె శ్రీ వెంకటేశ యిద్దరిఁ గూరిచితిమి
జట్టిగొనవయ్య నీవు సరసపురతులు