పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/527

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0189-1 శంకరాభరణం సంపుటం: 07-525

పల్లవి:
ఆఁటదానఁ గనక నిన్నంటి నేను
గాఁటపు దేవరవింకఁ గరుణించవయ్యా

చ.1:
మనసు దెలియలేక మరి నేఁ దమకించితి
ఘనుఁడవు నీవొళ్ళఁ గడమున్నదా
వెనకటిసుద్దులకు వేవేల వెంగేలాడితి
నినుపునిజమరివి నీకుఁ దప్పులున్నవా

చ.2:
వలపు నాపైనుండఁగ వట్టినేరములెంచితి
చెలువుఁడవు నన్ను రక్షించకుందువా
చలములకే నీతో సారెసారెఁ బెనఁగితి
పలుకుపంతగాఁడవు పాడిదుప్పేవా

చ.3:
చేయి నీవు చాఁచఁగాను చెక్కుగోరు దాఁకించితి
ఆయములు నీవెరఁగనట్టివున్నవా
పాయపు శ్రీ వెంకటేశ పైపైనన్నుఁగూడితివి
దాయగాఁడవు నన్నిట్టే దరిచేర్చవా