పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/524

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0188-4 మధ్యమావతి సంపుటం: 07-522

పల్లవి:
రావయ్య నీకేల యింత రామలతో బాసలు
భావించి నిన్నుఁజూచితే పై కొనకవుందురా

చ.1:
వుండుండి బూమివారెల్లా వూరకే నీకన్నులను
పుండరీకములనిట్టే పోలునందురు
కొండవలె నీవునేఁడు గొల్లెతలనంటఁగాను
అండనె నీపై నిందలాడకుందురా

చ.2:
యింతలో నల్లనుండఁగ యిందరు నీతిరుమేను
పాంతనట్టే నీలాద్రిఁ బోలునందురు
వింతగా చీఁకటిలోన వెన్నలు దొంగిలు నిన్ను
యెంతైనా నల్లఁదెల్లలు యెంచకుందురా

చ.3:
శ్రీ వెంకటేశుఁడ నీచేతిశంఖచక్రాలు
పూవుగుత్తుల చన్నులఁ బోలునందురు
కావించి మావంటివారిఁ గాఁగిలించి కూడితివి
చేవదేరె నిన్నురట్టు సేయకుందురా