పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/523

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0188-3 రామక్రియ సంపుటం: 07-521

పల్లవి:
ఆతఁడు జాణగాఁబట్టి అట్టేలోనికిఁ దీసి
యేతులెల్లాఁ జెల్లఁబెట్టె నేమి సేసేవే

చ.1:
చనవున నాయకుఁడు సరిఁ జన్నులంటితేను
పెనఁగి తిట్టుదురటే ప్రియురాలవు
గునియఁగానిందరిలో గురుతులు మోఁచితేను
యెనలేదప్పుడు సిగ్గు యేమి సేసేవే

చ.2:
కూరిమితో రమణుఁడు కొప్పువట్టి తగిలితే
గోరున గీఁటుదువటే గుణనిధివి
ఆరసి చూచితే పయ్యదకొంగు జారితేను
యేరితినుండునో సిగ్గుయేమి సేసేవే

చ.3:
శ్రీవేంకటేశ్వరుఁడు చేరి నిన్నుఁ గూడితేను
కావించి మీరుదురటే కలదానవు
మోవిగంటి సేసితివి ముద్రలు నిన్నంటెనిట్టే
యీవేళ సిగ్గులకు నీవేమి సేసేవే