పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/522

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0188-2 దేసాళం సంపుటం: 07-520

పల్లవి:
ఏమిచెప్పేవిఁక మాతోనెందాఁకను
మామాటలివియపో మరినేమెరఁగము

చ.1:
కూరిమియాఁటదానికి కొసరినంతాఁ జెల్లు
ఆరసి యింకానేమి ఆడేవయ్యా
నేరుపు నీకుఁ గలితే నావాపెకు లోనౌట
యేరీతి మాటాడినా యింకానేమెరఁగము

చ.2:
పాయపువనితకును పచ్చివలపెల్లాఁ జెల్లు
చేయివట్టి యిఁకనేమి చెప్పేవయ్యా
నాయమే నడపితేను నగుతా సమ్మతించుట
మాయపు కతలకెల్ల మరినేమెరఁగము

చ.3:
చక్కనియింతికి మరి సాదించినట్టే చెల్లు
పెక్కుసుద్దులిఁకనేల పెంచేవయ్యా
గక్కన శ్రీ వెంకటేశ కలసితిరిద్దరును
మక్కళించి విన్నపాలు మరినేమెరఁగము