పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/520

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0187-6 కాంభోది సంపుటం: 07-518

పల్లవి:
పదియారువేలు నిన్నుఁబైకొనుట యేమరుదు
మొదలనె నిన్నుఁగంటే మోహించకుందురా

చ.1:
చెక్కులకళల నిన్ను సెలవినవ్వుల నిన్ను
పక్కన నేనిటు చూచి భ్రమసితివి
చక్కనివాఁడవు తొల్లే సరి నివి గొన్నియైతే
మొక్కుచుఁ జెలులు నీకు మోహించకుందురా

చ.2:
తేనెలమాటల నిన్ను తియ్యనిమోవి నిన్ను
పూని దగ్గరినంతలో పొంగితినిదే
ఆనుక వయసువాఁడ వందుకుఁదోడివియైతే
మోనమున సతులెల్ల మోహించకుందురా

చ.3:
నేరుపురతుల నిన్ను నీటురాజసాల నిన్ను
గారవించి కాఁగలించి కరఁగితిని
యీరీతి శ్రీ వెంకటేశ యిది నీకె వన్నెవెట్టె
మోరతోపుచెలులైన మోహించకుందురా