పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/515

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0187-1 కేదారగౌళ సంపుటం: 07-513

పల్లవి:
అందులోనే వున్నవి ఆయములెల్ల
మందలించనివాఁడవా మతకరివి

చ.1:
మన్నించే నీనాలోనొక్కమాటపట్టుకే కదా
నన్ను నిన్నుఁ జూచుకొని నవ్వితి నేఁడు
విన్నపాలిందుకుఁగాను వేగినంతాఁజేయనేల
సన్నెరఁగనివాఁడవా చతురుఁడవు

చ.2:
ఇచ్చకపు నీవు సేసే యెన్నికలకే కదా
పచ్చిచేఁతలెల్లాఁజేసి భ్రమసితిని
తచ్చితచ్చియిందులోనే తగవులఁ బెట్టునేల
మచ్చికలనివాఁడవా మాటకారివి

చ.3:
కోరిక నీవుగూడిన కూటములకే కదా
చూరలైన రతులను చొక్కితినిట్టే
యీరీతి శ్రీవెంకటేశ యేలితివి నన్నునిట్టే
మారునితండ్రివి నీవే మండెమురాయఁడవు