పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/511

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0186-3 రామక్రియ సంపుటం: 07-509

పల్లవి:
ఎంతటిమగవాఁడవు యేఁటికి నీకుఁగొంకను
చింతలేక నీయిచ్చలఁ జెలరేఁగరాదా

చ.1:
మొగము చూచిన లోలో ముసుగువెట్టుకొనేవు
చిగురుగోరిచేఁతలు చెక్కులంటెనో
నగుతా కొంగువట్టితే నంటున సిగ్గువడేవు
అగడుగా నెవ్వతైనా ఆయాలు సోఁకించెనో

చ.2:
కందువమేను ముట్టితే గందము వూసుకొనేవు
విందుల నిపులకలు వెల్లవిరయ్యీనా
మందలించి మాటాడిజీ మౌనాననున్నాఁడవు
యిందులో నీబుసకొట్లెరఁగ వచ్చీనా

చ.3:
చన్నుల నిన్నొత్తితే సారెసారె లోఁగేవు
అన్నిటా నీవలపులు అట్టే కాఁగీనా
మన్నించిన యలమేలు మంగనై నిన్నుఁగూడితి
సన్నల శ్రీవెంకటేశ సంతోసషములాయఁగా