పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/508

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0185-6 శ్రీరాగం సంపుటం; 07-506

పల్లవి:
మెత్తని మనసున మేలుదాన నిదె
చిత్తగించె దయసేయవయ్యా

చ.1:
పెంచిన చిలుకలు పెక్కులు పేలీ
నంచెల నిటు మాటాడవయ్యా
పంచలకోవిల పాటలు వాడీ
కొంచక వద్దనె కూచుండవయ్యా

చ.2:
గూఁటితుమ్మిదలు గొణఁగులు గొణఁగీ
గాఁటపు నీకొంగు గప్పవయ్యా
ఆటలనెమళ్ళు అవె కేఁకరించీ
నీటునఁ గాఁగిట నించవయ్యా

చ.3:
జక్కవపులుగులు సగినాలు చెప్పీ
పెక్కురతుల ననుఁ బెనఁగవయ్యా
యిక్కువ శ్రీ వెంకటేశ కూడితివి
తొక్కిహంసలు దొలఁగకువయ్యా