పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/507

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0185-5 గౌళ సంపుటం: 07-505

పల్లవి:
ఏమని విన్నవించేము యిన్నిటాజాణవు నీవు
కామినిభావము చూచి కరుణించవయ్యా

చ.1:
తలఁపులు వలపులు తరుణిపులక లాయ
సాలసి యాసలు కనుచూపులాయను
పిలిచేటి పిలుపులు పెదవిపై నవ్వులాయ
నెలఁతభాగ్యములిఁక నీ చేతివయ్యా

చ.2:
కోరినకోరికలెల్ల గుబ్బలమెరుఁగులాయ
పైరడిఁ గరఁగులెల్లఁ జెంజెమటాయ
నేరిచిన విన్నపాలు నిండునివ్వెరగులాయ
ధీరుఁడవిన్నిపనులుఁ దెలుకోవయ్యా

చ.3:
కందువతమకములు కాఁగిటిలో రతులాయ
ముందువెనకటిచింత ముచ్చటాయను
యిందులోనె శ్రీ వెంకటేశ యింతిఁ గూడితివి
విందుల విభవముల వెలసితివయ్యా