పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/505

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0185-3 పాడి సంపుటం; 07-503

పల్లవి:
మరలి యేఁటిమాట మనమున్నచోటి
తరితీపులే కాక తమకించనేఁటికే

చ.1:
తేనెగారీ నీమోవి తేటలాయ నీమొగము
మోనానవిందుకే నేను మొక్కే నీకు
వానలాయఁ జెంజెమట వడి నీమేననెల్లా
ఆనుక పులకపైరులంటెను నామేనను

చ.2:
తెల్లనాయ నీకన్నులు దిష్టమాయ నీచేఁత
మొల్లమినిందుకే నేను మొక్కే నీకు
వొల్లనె నీముక్కున నిట్టూర్చుగాలి విసరఁగ
పల్లదపు నాగుబ్బలపైకొంగు జారెను

చ.3:
సరులు నీమేననొత్తి సరివచ్చె నీనవ్వు
మురిపెములాయ నేను మొక్కే నీకు
యిరవుగ శ్రీ వెంకటేశ నన్నునేలితివి
తెరలోనే నీకునాకుఁ దేరెను జగడము