పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/504

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0185-2 బౌళి సంపుటం: 07-502

పల్లవి:
కంటివటవయ్య నీవు కన్నుఁగొనల
వెంటనే చెయివట్టి తరవేయవయ్య ఇపుడు

చ.1:
కంకణసూడిగములు గల్లురనఁగాఁ జెలి
పంకముగాఁ గస్తూరి నీపైనలఁది
సుంకులఁ గుచాలు నిన్ను సోఁకెనంటా సిగ్గువడి
అంకెలఁ దలవంచుక అదివో నవ్వీని

చ.2:
మొలనూలిగంటలు మోయఁగా నీశిరసున
నలరు తట్టుపుణుఁడు అట్టె నీకంటి
యెలమి మర్మాలు నీకునెక్కడనో తాఁకెనంటా
తెలిగన్నులను నీదిక్కే చూచీని

చ.3:
మట్టెల రవళితోడ మంచముమీఁదటనుండి
ఱట్టుగా మెప్పించె నిన్నాఱడిభావాల
ఇటె శ్రీవెంకటేశ యింత సేయించితివంటా
ముట్టి మోవితేనెలాని మోహము చల్లీని