పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/503

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0185-11 సామంతం సంపుటం: 07-501

పల్లవి:
తల వంచుకోకుమీ తప్పు నీయందేమి లేదు
బలుదొరతనానకుఁ బాడి యిదే సుమ్మీ

చ.1:
ఇంతేసి నేనాడేది యిచ్చకము గాదు సుమ్మీ
కాంతలఁ జూచితే నీవు కరుణింతువు
అంతవాఁడవీమాటకు నట్టే సిగ్గువడకుమీ
బంతి దయగలవారి పాడి యిదె సుమ్మీ

చ.2:
వేడుక నిన్నుమెచ్చేది వెంగెములు గావు సుమ్మీ
కూడేమంటే సతులకుఁ గొంగిత్తువు
వాడికింతే యిందుకుఁగా వడి నవ్వునవ్వకుమీ
పాడిపంతాలవారికిఁ బాడి ఇదె సుమ్మీ

చ.3:
నమ్మించి కాఁగలించేది నమ్మనిది గాదు సుమ్మీ
యిమ్ముల సులభుఁడవు యెవ్వరికైనా
కమ్మి శ్రీ వెంకటేశుఁడ కలసితివిటు నన్ను
పమ్మి మోహపువారికిఁ బాడి యిదె సుమ్మీ