పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/502

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0184-6 ఆహిరి సంపుటం: 07-500

పల్లవి:
ఆతనివల్లఁ దప్పేది అరసి చూచేనంటే
కాతరపు నాగుణాల గతులింతే కాక

చ.1:
చనవుమెరసి నేను సారెకు మాటలాడఁగ
వినక మానీనా విభుఁడు తాను
ననిచి నాపై ప్రేమ నాఁటెనో నాఁటదో యని
అనుమానపు నామనసల్లాడీఁ గాక

చ.2:
వీడిన తురుముతోడ వేగమె నేమొక్కఁగాను
చూడక మానీనా సుగుణ తాను
వాడుదేర నన్నుఁగూడ వచ్చీనో రాఁడోయని
వేడుకతోఁ దమకించే విధమింతే గాక

చ.3:
పొంకానఁ గాఁగిలించి పొఁగ నేఁగూడఁగాను
లంకెగాక మానీనా శ్రీ వెంకటేశుఁడు
కొంకక నా రతులియ్యకొనునో కొనఁడోయని
సంకెలేని నాలో విచారమింతే కాక