పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/501

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0184-5 దేసాళం సంపుటం; 07-499

పల్లవి:
ఇంతి మోహము లిఁకనేమని చేప్పేము నీకు
మంతనాన నాకె నేలి మన్నించవయ్యా

చ.1:
చిలుకలు మాఁటాడితేఁ జేరి నీవంపినయట్టి
చెలుల పలుకులంటాఁ జెవి యొగ్లి వినును
అలులు మొరసితే నీవాడకు వచ్చేయప్పటి
బలుశంఖరావాలని పై పై నాలకించును

చ.2:
మరుని పంచబాణాలు మనసున నాఁటితే
విరుల వేసేవంటా వెస నవ్వును
సురటుల విసరితేఁ జూచి నీ వూరుపు గాలి
సరుగనే తెంచెనని సంతోసించుకొనును

చ.3:
చందురుఁడుదయించితే చాయల నీపంజనుచు
యిందుముఖి నీరాకకునెదురువచ్చు
అందపు శ్రీ వెంకటేశ అంతలో నీవేలితివి
యిందులోఁ దెలిసి వాని హీతులంటా మెచ్చును