పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/500

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0184-4 పాడి. సంపుటం; 07-498

పల్లవి:
తనకు నే విన్నవించేదాననా చెలులాల
కనుఁగొంటే నాకుఁ దనకరుణే కలది

చ.1:
మనసులెనసితేను మంతనాలు సైకమౌను
కనుచూపులింపులైతే కలుగు రతి
చెనకులియ్యకోలైతే చేఁతలెల్లా సమ్మతౌను
పెనఁగితే వలపులు పిప్పిగట్టునే

చ.2:
సమ్మతించి వూఁకొంటే చవులౌను కతలెల్లా
కుమ్మరించితే ప్రియాలు కొనసాగును
నమ్మితేఁ జుట్టురికము నాఁటుకొని దైలువారు
దిమ్మురేఁచితే సిగ్గులఁ దెల్లవారునే

చ.3:
సరవులు నెరపితే సతమౌను కాఁగిలి
మరిగితే సరసము మక్కళించు
యిరవై శ్రీవెంకటేశుఁడితఁడె నన్నుఁగూడె
అరసి పైకొంటేనాసలే మించునే