పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0109-1 ముఖారి సంపుటం: 07-049

పల్లవి:
అప్పటినాతనినేమి యనేవు సుమ్మీ
కుప్పలైన వలపుల గుణమిది సుమ్మీ

చ.1:
పాసిన కూటమి చవి భావించు(వించి) లోలో రెప్ప
మూసి యెత్తి చూచినట్టి మోహము చవి
యీసున సాదించేనంటా యింటికి వచ్చుట చవి
వేసరి యాతనినేమి వెంగెములాడకువే

చ.2:
తగవులఁ బెట్టినట్టి తరితీపులు చవి
అగపడకున్నఁ బెట్టియానలు చవి
జగడపువేళల సరియాఁకలు చవి
తగదనాతనినేమి తప్పులెంచవలదే

చ.3:
తెర మాటున నుండే తేటల మాటలు చవి
సురతపు వేళ గోరిసోఁకులు చవి
ఇరవై శ్రీ వేంకటేశుఁడింతలో నిన్నుఁగూడె
తరవాతి పనులెల్లా దక్కె నీకుఁ గదవే