పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/499

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0184-3 దేసాళం సంపుటం: 07-497

పల్లవి:
నీ మీఁది తలపోఁతలే నిండు రతిగా భావించి
ప్రేమతోనున్నది యిట్టె ప్రియము చేకోవయ్యా

చ.1:
వీడెమిచ్చే యప్పటి వేడుకలు దలపోసి
ఆడుకోలుమాఁటలెల్ల నటుదలఁచి
కూడివున్నవేళల గురుతులు దలపోసి
వోడక సంతోసములనోలలాడుచున్నది

చ.2:
కేళాకూళిలో నీమేలములు దలపోసి
చేలకొంగువట్టిన సిగ్గు దలఁచి
సోలీఁ గొలు వున్నచోటి చూపులు దలపోసి
వోలి సంతోసములలో నోలలాడుచున్నది

చ.3:
ముప్పిరిగొనిన నీమోవితీపు దలపోసీ
నెప్పున నీవు గూడిన నేర్చు దలఁచి
యిప్పుడు శ్రీ వెంకటేశ యీకె యలమేలుమంగ
వొప్పగు సంతోసాన నోలలాడుచున్నది