పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/496

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0183-6 శంకరాభరణం సంపుటం: 07-494

పల్లవి:
ఇదివో ద్రిష్టాంతము యిచట మీయందె కంటి
యెదిరితే వెనకముందింతాఁ బెడరేఁచును

చ.1:
యేకతమైతేఁ జాలు యెంతటలుకైనాను
పోకుండా లోలోనే పొందుసేసును
సాకిరి గలితేఁ జాలు సరినెంతమోనమైనా
వాకిచ్చి మాటాడించి వడిఁ గొసరించును

చ.2:
పానుపాక్కటైతేఁ జాలు పచ్చివొట్లెట్టివైనా
మానఁజేసి తమకము మతిఁరేఁచు
మేనులు సోఁకితేఁ జాలు మిక్కుటపు కాఁకలెల్లా
ఆనుకొని చల్లఁజేసి ఆయములు గరఁచు

చ.3:
బాగాలందుకొంటేఁ జాలు పరాకులన్ని మాన్పి
చేగలెక్కి రతులెల్లాఁ జిమ్మిరేఁచును
యీగతి శ్రీ వెంకటేశ యీకె నీవుఁ గూడితిరి
జూగులేని సరసాలు చనవులిప్పించును