పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/493

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0183-3 పాడి సంపుటం: 07-491

పల్లవి:
చెవులారా వినేఁగాని చెప్పమా నాకాసుద్ది
జవళి వలపు లిట్టే చల్లుదురా

చ.1:
పారి నిన్నుఁ దలఁతునెప్పుడునంటానాడేవు
తరుణులఁ బొందేవేళఁ దలఁతువా
యెరవులేక నాకే యెదురు చూతుననేవు
కరఁగి చొక్కే వేళ కనువిచ్చి చూతువా

చ.2:
వనజాక్ష నారుపే వ్రాసి చూతుననియేవు
వనితల వురముపై వ్రాతువా
చనవున నాపేరే జపయింతుననేవు నీ
యనుఁగుఁగాంతఁ బిలిచేయప్పుడు జపింతువా

చ.3:
ఎమ్మెలతో నేరుపులెంతునంటానాడేవు
కొమ్మలతోడుత నట్టే కొనేడుదువా
మమ్ము శ్రీ వెంకటేశ మండెమురాయఁడవై
సమ్మతిఁ గూడితి విట్టే చనవిత్తువా