పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/492

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0183-2 కేదారగౌళ సంపుటం: 07-490

పల్లవి:
చద్దికి వేఁడికి మీరు సరసములాడరాదా
యిద్దరుఁ గూడితిరి మీకిఁకనేల అలుక

చ.1:
మచ్చరపు గొణఁగులు మాఁటలాడినందాఁకానే
అచ్చలము మోము చూచినందాఁకనే
తచ్చనలన్నియు నేకాంతములైనందాఁకానే
యెచ్చుకొందు లేదు మీకు యిఁకనేల అలుక

చ.2:
మునుకొన్నజగడము మొక్కు మొక్కినందాఁకానే
అనుగుమోనము నవ్వినందాఁకానే
పెనఁగులాటలు తమిపెరరేఁచినందాఁకానే
యెనసెఁ జుట్టురికములిఁకనేలె అలుక

చ.3:
నేసవెట్టిన సిగ్గులు చేయి మోఁచినందాఁకానే
ఆసలెల్లాఁ గాఁగిలించినందాఁకానే
వాసితో శ్రీ వెంకటేశ్వర కూడితిరి మీరు
యీసులెల్లాఁ బెడఁబాసెనిఁకనేఁటియలుక