పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/490

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0182-6 కాంబోది సంపుటం: 07-488

పల్లవి:
వద్దనేమా నేము వలవనిజోలైతే
తిద్దలేము తగవులు దిష్టమైన పనికి

చ.1:
వగలు వెట్టుక నీవు వట్టి కూరిమి గొసరి
యెగసక్కేలాడితే నేనెరఁగఁ గాక
మగువ గుణములెంచి మరి నీ గుణములెంచి
నగుమా వోరిచీ నాపె నాయమైనపనికి

చ.2:
దిమ్ములు రేఁచుక నీవు తెరవలఁ జూపి మోపి
యెమ్మెలెల్లా నెరపితే నెరఁగఁ గాక
నెమ్మదిఁ దగవెరిఁగా నెలఁతయిరవెరిఁగి
రమ్మా కలసీ నాపె రవ్వగాని పనికి

చ.3:
పంతములెల్లానాడి బలిమిఁ గాఁగిటఁ బట్టి
యింత కిందుపడితే నేనెఱఁగఁ గాక
యింతలో శ్రీ వెంకటేశ యెనసితి విటులానే
వంతిమ్మా పెనఁగీ నాపె వసమైన పనికి