పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0108-6 సామంతం సంపుటం: 07-048

పల్లవి:
అంగనలేమన్నా నన్నునంటిరి గాని
కుంగని కుచాలఁ దన్ను కుమ్మవద్దాయిఁకను

చ.1:
అల్లవిగో తనమేననప్పటి పెంజెమటలు
మల్లాడి నామేనఁ జమరవచ్చీని
పల్లదాన నేఁదన్ను పట్టుక యిందుకుఁదగ
వెల్లవిరిఁ దమలాన వేయవద్దా యిఁకను

చ.2:
ఇదిగదే తనమేన యెరవులకంటమాల
బెదరక నామెడఁ బెట్టవచ్చీని
కుదియించి యిందుకుఁ దనకురులు నాపదమున
నదిమి యేమైనాఁ జేసి ఆఁగవద్దా యిఁకను

చ.3:
కట్టుకవున్నాఁడదె కానెగా యెవ్వతో చీర
వెట్టికి నాపైఁ గొంగు వేయవచ్చీని
ఇట్టె శ్రీ వేంకటేశుఁడు యెమ్మెతోఁగూడినందుకు
తిట్టురాని తిట్లెల్లాఁ దిట్టవద్దా యిఁకను