పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/484

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0181-6 కేదారగౌళ సంపుటం: 07-482

పల్లవి:
ఎప్పుడూను నీ సుద్దులిటువంటివి
గుప్పి సముద్రములోనే కురియించేవు వాన

చ.1:
కానికె దెచ్చినయాపె కాచుకిట్టే వుండఁగాను
వూని వీఁగేయాపెనేల వొడివట్టివు
ఆని దప్పిగొంటినన్న యాపెనటువెట్టి నీళ్ళ
నానుచున్నయాపెకేల పానకమిచ్చేవు

చ.2:
పెండిలికి వచ్చినాపె పెరట విడిశుండఁగా
చండి పారుగాపెనేల సన్నసేసేవు
అండ నాఁకలిగొన్నాపె అట్టెమోముచూడగాను
నిండఁదనిసినాపెకు నీవువిందు వెట్టేవు

చ.3:
వొద్ది యలమేలుమంగనురమునఁ బెట్టుకొని
గద్దించి కడవారిపై కాలుచాఁచేవు
కొద్దితో శ్రీ వెంకటేశ కూడినాపె వుండఁగగాను
అద్ది పిల్చినాపెకేల ఆసలు నించేవు