పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/482

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0181-4 హిందోళవసంతం సంపుటం: 07-480

పల్లవి:
నీవైన విన్నవించవే నేర్చుకొనునాతఁడు
వేవేలు కోరికలకు వెల వలెనా

చ.1:
యీడువెట్టుకాడఁగాను యేది నిజమౌనో
యేడ లేనిమాఁటలునేల పెంచీనే
వాడికవలపులకు వచ్చినంతే లాభము
వోడక ఆసోదానకు వొడిగట్టువలెనా

చ.2:
దొంతల సరసముల దొమ్మియెంత గూడునో
యెంత దరవైన నవ్వులేమి సేసీనే
బంతి భోజనాలకు పట్టినదెల్లాఁ గడి
వింతజాణతనాలకు వేళ చూడవలెనా

చ.3:
మచ్చికఁ బరవశాన మఱతునో తలఁతునో
హెచ్చి తన మోహమేల యెచ్చరించీనే
తచ్చి శ్రీ వెంకటేశుఁడు తానె నన్నిదె కూడె
కొచ్చి కొచ్చి తమకము గుదిగుచ్చవలెనా