పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0105-5 రామక్రియ సంపుటం; 07-047

పల్లవి:
ఇంత సేసెఁగా నేఁడు యింతి నీగుణములెల్లా
చెంతలనాకె పసలఁ జిక్కితిగా నీవు

చ.1:
కోపగించుకొన్నవేళ కోరి నీవు మోహించిన
ఆపెపైనాన వెట్టితే నట్టె మానేవు
పైపై నాపెమీఁది పదములు వాడితేను
మాపుదాఁకా పరాకెల్ల మానుదుగా నీవు

చ.2:
అనవసరపువేళ నాపెవారు వచ్చిరంటే
వెనుకొని యెదురుగా వెళ్ళి వచ్చేవు
పనివడి యాపె అప్పణగల మగువల
వినయపు విన్నపాలు విందువుగా నీవు

చ.3:
అలసి నిద్రించేవేళ నాపె నీవొద్దఁ గూచుంటే
పలురతులకు లోనై భ్రమతువుగా
వొలీసి శ్రీ వేంకటాద్రినుండి వచ్చి మాడువూర
మలసి నన్నుఁగూడి మన్నించితిగా