పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/474

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0180-2 మాళవిశ్రీ సంపుటం: 07-472

పల్లవి:
చెల్లఁబో నీవెటువంటి చెలివైతివే
కొల్లలుగానతనినే కూడితివిగా

చ.1:
మనసిచ్చి ఆతనితో మాఁటాడవైతివిగా
చనవు సేసుకొని కొసరవైతిగా
పెనఁగి చేతులువట్టి పిలువవైతివిగా
వినయాన భారము పై వేయవైతిగా

చ.2:
తప్పరాని బాసలెల్ల తలఁపించవైతివిగా
అప్పసము నేమొక్కితిననవైతిగా
అప్పుడె ముద్దుటుంగరమటు చూపవైతివిగా
నెప్పుననానలు వెట్టి నెట్టుకొనవైతిగా

చ.3:
నగవులనే వలపు నానఁబెట్టువైతివిగా
చిగిరించ నిచ్చకాలు సేయవైతిగా
తగు శ్రీ వెంకటేశుఁడు తానెవచ్చి నన్నుఁగూడె
నిగిడి నీయంత నీవు నేర్పవైతిగా