పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/473

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0180-1 ముఖారి సంపుటం: 07-471

పల్లవి:
వినుమా ఆపె చేతనే వింతలుగఁ గాకుచేసి
అనఁబోలుదువు నీవే ఆపెతో నేఁడు

చ.1:
మంతనాన నీవు నేను మాఁటలాడుకొన్న మాఁట
అంతలో నెవ్వరు చెప్పిరాపెతో నేఁడు
చెంత నీచేఁతకు నేను చేయెత్తి మొక్కిన మొక్కు
అంతరంగమెట్టు చెప్పిరాపెతో నేఁడు

చ.2:
పరపు పై నిద్దరము పచ్చగా నవ్విన నవ్వు
అరసి యెవ్వరు చెప్పిరాపెతో నేఁడు
తెరలోని మనగుట్టు దిష్టముగ వివరించి
అరుదుగానెట్టు చెప్పిరాపెతో నేఁడు

చ.3:
మనలోఁ గూడిన యట్టి మదన బంధములెల్ల
అనువులెవ్వరు చెప్పిరాపితో నేఁడు
ఘనుఁడ శ్రీవెంకటేశ కలసితివప్పటిని
అనవయ్య యింకా నీవు ఆపెతో నేఁడు