పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/472

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0179-6 దేసాళం సంపుటం: 07-470

పల్లవి:
కొమ్మలాల యెంతవాఁడే గోవిందరాజు
కుమ్మరించీ రాజసమే గోవిందరాజు

చ.1:
వులిపచ్చినవ్వులతో వొత్తగిలి పవ్వళించి
కొలవు సేయించుకొనీ గోవిందరాజు
జలజాక్షులిద్దరూను సరిఁ బాదాలోత్తఁగాను
కొలఁదిమీర మెచ్చీని గోవిందరాజు

చ.2:
అదె నాభికమలాననజునిఁ బుట్టించి తాను
కొదలేక వున్నవాఁడు గోవిందరాజు
చెదరక తనవద్ద సేవసేసే సతులకు
గుదిగుచ్చీ వలపులు గోవిందరాజు

చ.3:
వొప్పుగా వామకరము వొగిఁజాఁచి వలకేల
కొప్పుగడునెత్తినాఁడు గోవిందరాజు
ఇప్పుడు శ్రీ వెంకటాద్రినిరవై శంఖు చక్రాలు
కుప్పెకటారముఁబట్టె గోవిందరాజు