పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/470

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0179-4 సౌరాష్ట్రం సంపుటం: 07-468

పల్లవి:
ఇదివో మాతోడి పొందులిటువంటివి
వుదుటున నిందుకెల్ల వోపుదువా నీవు

చ.1:
చిగురుమోవిని నేను చెలఁగి మాఁటాడఁగా
వొగరుగాదుగదా వో విభుఁడా
నిగిడి పద్మపు మోము నీకు నేను చూపఁగాను
తగిలి మరునియమ్ము తలఁపుగాదుగదా

చ.2:
కలువ కన్నుల నిన్నుఁ గాఁడిపారఁ జూడఁగాను
చలిగొనదు గదా యిచ్చట విభుఁడా
బలు కుచ గిరులను పైపై నిన్నొత్తఁగాను
నులివడి నీమేను నొవ్వదుగదా

చ.3:
అంది బాహులతల నిన్నట్టి చుట్టుకొనఁగాను
కందదుగదా శ్రీ వెంకట విభుఁడా
అందముగాఁ గలసితి నలమేలుమంగ నేను
విందువంటి మోవితేనె వెగటుగాదుగదా