పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/465

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0178-5 దేసాళం సంపుటం; 07-463

పల్లవి:
తప్పుగాదు రావయ్యా దానికేమి దోసమా
వుప్పుచింది యెత్తితేను వొకటి రెండవుఁ గా

చ.1:
నగితిఁగా నేను నామోము నీవు చూడఁగ
తగి యిన్నాళ్ళకు నేను తలఁపయితిఁగా
చిగిరించిన వలపు చేగలెక్కెవి యిపుడు
మొగి ముమ్మారు నాఁటితే ములుక వంగవుఁ గా

చ.2:
విరుల వేసితిఁగా వెరగుతో నీవురాఁగా
పరగ నీ కూటమికి బాఁతైతిఁ గా
మురిపేన మూలవావి ముంగిటికి వచ్చెనేఁడు
పారలి మా జవ్వనాలు పోఁకకు పుట్టెఁడు గా

చ.3:
మొకమెడితిఁగా నేను ముంచి నీవు గూడఁగాను
వొకవేళనెనాను వొద్దికైతిఁగా
వెకలివై నన్నును శ్రీవెంకటేశ యేలితివి
ప్రకటమై పేరితే పాలే పెరుగవుఁగా