పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/463

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0178-3 కేదారగౌళ సంపుటం; 07-461

పల్లవి:
పొంచి యెదురుకట్లకుఁ బోవమ్మ పతి వాఁడె
ముంచి యాతనికి నీవు మొక్కనెర్తువు

చ.1:
చవులుగా విచ్చివిచ్చి సారెసారెనాతనికి
చెవిలో నీమాఁటలెల్లఁ జెప్పనేర్తువు
చివురుఁదమకముబ్బ చిత్తజకళలు రేఁగ
నవకానఁ గవకవ నవ్వనేర్తువు

చ.2:
మంచము దగ్గర నుండి మారుకొని ఆతనితో
అంచ సరసము నీవాడనేర్తువు
కొంచక కొప్పు విడిచి కురుల చిక్కులుదీసి
పెంచి పెంచి వలపులు పేర్చనేర్తువు

చ.3:
గక్కనఁ గాఁగిట నించి కప్పురము నోటికిచ్చి
వుక్కునఁ గొనగోరనొత్తనేర్తువు
ఇక్కువ శ్రీ వెంకటేశుఁడింతలో నన్నుఁ గూడె
యెక్కవమ్మ వురమెలయించనేర్తువు