పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఏడవ భాగం.pdf/462

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0178-2 మధ్యమావతి సంపుటం: 07-460

పల్లవి:
లోకముల జాడలివి లోనాయ విభుఁడు నీకు
సాకిరివెట్టి నీవేల సాదించేవే

చ.1:
చలములు మానితేనే జగడాలు చక్కనౌను
అలుకలు దీరితేనే ఆసలు మించు
కలయికలు గలితే కపటాలన్నియుఁ బాసు
వెలినుండి నీవేల వెంగెమాడేవే

చ.2:
బింకములాడుకోకుంటే బెరయుఁ జుట్టురికము
మంకు లేని పొందులైతే మతి గరఁగు
అంకెలఁ బైకొంటేనే అరమరపులు నిండు
సంకు మోపి నీవేల సాలయ వచ్చేవే

చ.3:
వేడుకలఁ గూడితేనే వెలయు సెలవి నవ్వు
వాడికెలు గలితేనే వడదేరును
యీడనె శ్రీ వెంకటేశుఁడింతలోనె నిన్నుఁగూడె
జాడ తోడ నింకనేల సన్నసేసేవే